VJ Sahiti Vanam (విజ్ఞానజ్యోతి సాహితీవనం)

వల్లూరుపల్లి నాగేశ్వరరావు విజ్ఞానజ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (వీఎన్ఆర్‌వీజేఐఇటి)లో తెలుగు భాష-సంస్కృతి-సాహిత్యం-సాంకేతికతలకు సంబంధించి వెలిసిన విద్యార్థిసమితి "విజ్ఞానజ్యోతి సాహితీవనం". జులై 22, 2013 నుంచి యిప్పటి దాకా ఎన్నో విభిన్నమైన కార్యక్రమాలతో, పోటీలతో అందఱినీ అలరిస్తూ వస్తుంది ఈ విద్యార్థి కూటమి. భాషాభిమానులకు సాహితీ ప్రపంచం అయిన విజ్ఞానజ్యోతి సాహితీవనం, తెలుగు భాషా దినోత్సవం మరియు తెలంగాణ భాషా దినోత్సవాలను పురస్కరించుకొని ప్రతి ఏడాది ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 9 వరకు "అక్షర" సాహితీ మహోత్సవాన్ని నిర్వహిస్తుంది. నేటి సమాజానికి మాతృభాష ప్రాధాన్యతను, అందులోని మాధుర్యాన్ని తెలుపడంతో పాటు సాంకేతికయుగంలో తెలుగు స్థానాన్ని సుస్థిరం చేసే దిశగా వివిధ కార్యశాలలను కూడా నిర్వహిస్తోంది. కళాశాలలోని సాంస్కృతిక విద్యార్థిసమితులన్నిటిలోనూ ఒక్క విజ్ఞానజ్యోతి సాహితీవనం మాత్రమే "Telugu in Information Technology", "Natural Language Processing", "Language Technology Tools and Big Data Analysis" వంటి సాంకేతిక విషయాలకు సంబంధించి కార్యశాలలు నిర్వహించింది. ఇటీవలే తంజావూరు, తమిళనాడు లోని శస్త్రా విశ్వవిద్యాలయంలో జరిగిన సాంస్కృతిక ఉత్సవం అయిన "KURUKSASTRA" లో విజ్ఞానజ్యోతి సాహితీవనం కళాశాల తరపున పాల్గొని, తెలుగు సాహిత్య కార్యక్రమాలలో "ప్రథమ" మరియు "ద్వితీయ" బహుమతులు పొందింది.